వసంత నవరాత్రులు
వసంత నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల ప్రయోజనం ఏంటి?
వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే ,లలితా స్వరూపం రాముడు. శ్రీ రాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.శ్రీ రామచంద్రుల వారు సీతా సమేతంగా వసంత నవరాత్రి పూజను ఆచరించేవారంట.సీతమ్మ తల్లి అమ్మవారి ఉపాసన చేసేవారు.
బ్రహ్మాండాలను సృష్టించిన ఆ పరాశక్తికి ఎన్నో రూపాలు ఎన్నో పేర్లు ఎ పేరుతో పిలిచిన చటుక్కున పలుకుతుంది.భక్తితో అమ్మ అని పిలిస్తే తల్లిలా మన వెన్నంటే వుండి మనల్ని నడిపిస్తుంది. అమ్మ సర్వాంతర్యామి ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది .
*ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|*
*శరద్వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్||*
సంవత్సర చక్రంలో వసంత, శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.
సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు.
మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి , తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి , ప్రశాంత స్థితిని అనుభవించడానికి , నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాస మహర్షి.
వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.
రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి , దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని , దేవిని ఆరాధించి , సకల సంపదలనూ పొంది, దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.
కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించాడు.
శ్రీ మాత్రే నమః...🙏
Comments
Post a Comment