ఫాల్గుణం ప్రఖ్యాతం*
*ఫాల్గుణం ప్రఖ్యాతం*
సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు. ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో ఆకురాలే కాలం. నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం. వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన, లౌకిక ఆధ్యాత్మిక సమ్మళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం
షడృతువులలో అఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది ఫాల్గుణం. ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు. ఆ సమయంలో మనో నిగ్రహం కావలి. దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము. వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం. అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు. పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసంను ఫల్గుణ మాసమని పిలుస్తారు. ఈ మాసవ శిశిర ఋతువుకు వీడ్కొలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలుకుటకు స్వాగత ద్వారం వంటిది. ఫల+గుణ = ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కావుననే ఫాల్గుణం విశిష్టమైనది, దివ్య ప్రభావం కలిగినది. అందుకే ప్రాముఖ్యత పొందింది.
విష్ణు సహస్రనామాలలో శిశిరఃశర్వరీ కరః నారాయణునకు ఒక నామం కలదు. నారాయణుడు ఈ సమాసంలో గోవిందనామంతో నియామకుడు. ఈ కారణంచే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు. ఫల్గుణీ నక్షత్రం దేవతా గణం. పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి సూర్యడు "ఆర్యముడు"" అనే పేరుతో దేవతగా ఉంటాడు. ఈయన అధిక తేజస్సు కలవాడు కావున దేవతలందరూ అనుసరించి ఉంటారు. ఫాల్గుణ మాసంలో ఎన్నో వ్రతాలాచరించాలని శాస్త్ర వచనం.
ఈ సంవత్సరం మార్చి 1న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైన మాసం. ఫాల్గుణం ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం. విజ్ఞానమయం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతమంటారు. ఈ పన్నెండు దినాలు నదీస్నానమాచరించాలి. పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని "తిల" చతుర్థి అంటారు. దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్థీ వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి. దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజున పుత్రగణపతి వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది.
శుద్ధ పంచమినాడు అనంత పంచమి వ్రతం చేయాలి. ఈనాడు గణేశుని అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. సప్తమి నాడు అర్కసంపుట సప్తమి ఆచరించాలి. ఉషోదయ కాల స్నానానంతరం సూర్యునకు అర్ఘ్యమివ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్. కావున ఆరోగ్యం కొరకు సూర్యుని ప్రార్థించాలి.
ఈ మాసంలో లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది. లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీలక్ష్మీ నారాయణులను తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి. మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చెయ్యాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీలక్ష్మీ నారాయణులను పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతాల వలన వేలకొలది గోదానాలు చేసిన ఫలితా కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీనృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీమహేశ్వర వ్రతమాచరించాలి. ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళి అని, 'హోల' అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈ రోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి "శ్రీహోళికాయైనమః "అని పూజించి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ "వందితాసి సురేంద్రణే బ్రహ్మణా శంకరేణ ఛ అతస్త్వాం పాహినోదేవి భూతే భూతి ప్రధోభవ" అని చదవాలి.
హోళి పసుపుకు, పసుపు పరిమళానికి ప్రతీక. నీటిలో కలిపిన ద్రవాన్ని " వసంతం" అని అంటారు.
వసంతాలాడుకోవడం వసంతమాసానికి స్వాగతం చెప్పడమే. పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలాత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం.
ఈ పూర్ణిమనాడు మధురైలో శ్రీమీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తెదువచే వందన తిలకం, నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.
బహుళ ఏకాదశిని విజయైకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను అర్చించి ఉపవాసముండి నియమ బద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి.
బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమవాస్య అంటారు. ఈరోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్ఠం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది అయ్యప్పస్వామి అవతరణ, ఈ మాసంలోనే జరిగింది. ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం. భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే ఫాల్గుణం ప్రాముఖ్యం.
Comments
Post a Comment