ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవటం ఎలా?

ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవటం ఎలా?
మేష రాశి వారికి, అంటే అశ్వినీ, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మార్చి 29, 2025 నుంచి ప్రారంభం అయ్యే ఏలినాటి శని (ఏడున్నరేళ్ల శని) ప్రభావం ఎలా ఉంటుంది? ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి?
మేష రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం
మార్చి 29, 2025 నుంచి శని మీన రాశిలో సంచరిస్తాడు. ఈరోజు నుంచి మేష రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది మరియు మకర రాశి వారికి పూర్తవుతుంది. మేష రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం, ఎలా ఉంటుంది?. తన నీచ రాశి అయిన మేష రాశి వారిని శని ఇబ్బంది పెడతాడా? లేక అనుకూలిస్తాడా? మొదలైన ఎన్నో ప్రశ్నలకు ఈ వ్యాసం సమాధానం చెపుతుంది. చివరి వరకు పూర్తిగా చదవండి.

అసలు ఏలినాటి శని అంటే ఏమిటి?
గ్రహాలన్నింటిలోకి శని నెమ్మదిగా సంచరించే గ్రహం. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు. సహజంగా శని పాపగ్రహం అవటం మరియు ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహం అవటం వలన శనికి గోచారం విషయంలో మిగతా గ్రహాల గోచారం కన్నా ప్రాధాన్యత ఎక్కువ. శని మన రాశి నుంచి 12వ, ఒకటవ మరియు రెండవ ఇంటిలో సంచరించే ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని లేదా సాడే సాత్ అని పిలుస్తారు. ఈ మూడు స్థానాలకు ఇంత ప్రాధాన్యత ఉండటానికి కారణమేమిటంటే ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని మరియు జీవన విధానాన్ని సూచించేవి కావటం. ఒకటవ ఇల్లు మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మరియు మన జీవన విధానాన్ని సూచిస్తుంది. రెండవ ఇల్లు మన కుటుంబాన్ని మరియు ఆర్థిక స్థితిని సూచిస్తుంది. 12వ ఇల్లు మన ఖర్చులను, ఆరోగ్య సమస్యలను మరియు స్వయంకృతాపరాధాలను సూచిస్తుంది. ఈ స్థానాల్లో కర్మ కారకుడైన శని సంచరించడం వలన ఆయా స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఆ వ్యక్తులు అనుభవిస్తారు. నిజానికి శని ఇచ్చేది కష్టంలా కనిపించినప్పటికీ అది మనలో ఉన్న లోపాలను, మనం మనం చేసిన పురాకృత కర్మలను తొలగించేదే తప్ప మనల్ని ఇబ్బందులకు గురిచేసేది కాదు. శని గోచారం ఈ మూడు ఇండ్లలోనే కాకుండా, నాలుగవ ఇంటిలో, మరియు ఎనిమిదో ఇంటిలో కూడా చెడు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వాక్యం. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు.

శని గోచారం నిజంగా చెడు చేస్తుందా?
చాలామందికి శని గ్రహం అంటేనే ఒకలాంటి భయం ఉంటుంది. దానిలోకి ఏల్నాటి శని సమయం అంటే మరింత భయం ఉంటుంది. శని ఈ ఏడున్నర సంవత్సరాల కాలంలో ఏం చేస్తాడో, ఎన్ని కష్టాలు పెడతాడో అనే ఆలోచన వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే నిజంగా శని ఆ విధంగా కష్టపెడతాడా లేక మంచి చేస్తాడా అనేది ఒకసారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం మకర రాశి వారికి మార్చి 29, 2025 వరకు ఏల్నాటి శని సంచారం ఉంటుంది. ఈ తేదీనాడు మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తవుతుంది, మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏడున్నర సంవత్సరాల గోచారం ఎలా ఉంటుందో పరిశీలించే ముందు అసలు శని ఏం చేస్తాడు, శని స్వభావం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.
శని మనం చేసే రోజువారి పనులకు, మన ఉద్యోగానికి, మన కర్మకు కారకుడు. జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఆ జాతకుడి జీవితం బాగుంటుంది. అంటే ఆ వ్యక్తి ఏ పనైనా సక్రమంగా చేస్తాడు. శని జాతకంలో బాగున్న వ్యక్తి బద్ధకానికి, వాయిదా వేసే స్వభావానికి దూరంగా ఉంటాడు. ఏ పని అయినా సమయానుసారం చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతి సాధిస్తాడు. మనసుకు, ఆలోచనలకు కారకుడైన చంద్రుడికి శత్రువైన శని ఆలోచనలకంటే కూడా పనికి ప్రాధాన్యత ఇచ్చే గ్రహం. అందుకే మన ఆలోచనలకు కారకుడైన చంద్రుడు, మన అహంకారానికి, అధికారానికి కారకుడైన సూర్యుడు శనికి శత్రువులయ్యారు. శనికి ఒకరికి పని చెప్పి చేపించటం కంటే సొంతంగా దానిని చేయడం అంటే ఎక్కువ ఇష్టం. జాతకంలో శని బాగాలేకుంటే ఆ వ్యక్తి బద్ధకస్తులుగా, చెడు పనులు చేసే వాడిగా మరియు పని మధ్యలో మానేసే వాడిగా ఉంటాడు. దాని కారణంగా ఆ వ్యక్తికి జీవితంలో అభివృద్ధి తొందరగా జరగదు. కాబట్టి శని ప్రభావాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే శని ఇచ్చే ఫలితాలు మన జీవితాన్ని అభివృద్ధి పరిచేవే తప్ప, నష్టపరిచేవి కావని అర్థమవుతుంది. ఇప్పుడు శని గోచారం ఏ విధంగా మనపై ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని చూద్దాం.

ఏలినాటి శని సమయంలో, శని 12వ ఇంటిలో ఉన్నప్పుడు మనకు ఖర్చులు పెరుగుతాయి. అయితే శని గోచారం 11 ఇంట్లో ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించడానికి అత్యాశతో చెడు మార్గాలు ఎంచుకోవడం, లేదా అన్యాయంగా ఇతరుల డబ్బును, ఆస్తులను ఆక్రమించుకోవడం చేసినప్పుడు మాత్రమే శని 12వ ఇంట్లో సంచరించేటప్పుడు ఎక్కువగా చెడు చేసే అవకాశనముంటుంది. ఈ సమయంలో మనం అన్యాయంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు మాత్రమే ఖర్చవుతుంది తప్ప న్యాయంగా సంపాదించినది కాదు. జాతకంలో శని ఉన్న స్థితి, మన రాశ్యాధిపతికి శనితో ఉన్న సంబంధాన్ని బట్టి అలా సంపాదించిన డబ్బు నష్టపోవటం దాని కారణంగా ప్రభుత్వ శిక్షకు గురవటం మొదలైన ఫలితాలుంటాయి. అంతేకాకుండా ఒకవేళ మనం మనకి కానీ మన కుటుంబానికి కానీ లేదా సమాజానికి కానీ అవసరమైనప్పుడు తగినంత డబ్బు ఖర్చు చేయకుండా పిసినారితనంతో డబ్బును పొదుపు చేయాలని ఆలోచన ఉండేవారికి శని ఈ సమయంలో తప్పనిసరిగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కల్పిస్తాడు. దాని కారణంగా వారిలో ఉండే లోబత్వం తొలగిపోవడమే కాకుండా ప్రాపంచిక విషయాల మీద ఉన్న అనవసరమైన ప్రేమను, ఆసక్తిని తొలగించి వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళేలా చేస్తుంది. దాని కారణంగా భవిష్యత్తులో మనకు ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. మరియు పురాకృత చెడు కర్మ నశిస్తుంది.
శని 12వ ఇంటిలో ఉన్న సమయంలో డబ్బు ఖర్చు విషయంలో అహంకారానికి పోవటం, లేదా విలాసాల కొరకు ఖర్చు చేయడం తగ్గించుకోవడం మంచిది. గతంలో విలాసాల కొరకు అధికంగా డబ్బు ఖర్చు చేసేవారు ఈ సమయంలో డబ్బు అందకపోవడం వలన ఆ లోపాన్ని తగ్గించుకోవడమే కాకుండా, డబ్బు విలువ తెలుసుకోగలుగుతారు. శని మనం సంపాదించిన డబ్బునే ఖర్చు చేసేలా చేస్తాడు తప్ప అప్పలను అప్పులపాలు చేయడు. ఈ సమయంలో శని ప్రభావం తగ్గించుకోవాలంటే డబ్బు మీద వ్యామోహం తగ్గించుకోవాలి, మనం అవసరమైన వారికి కొంత డబ్బు దానం చేయటం అలాగే శారీరకంగా కూడా అవసరమైన వారికి మనకు తోచిన సాయం చేయడం వలన శని ఇచ్చే ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది.

శని గోచారం ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు మనలో మానసికంగా మరియు శారీరకంగా ఉండే లోపాలు తొలగిపోతాయి. మనలో ఉండే బద్ధకం కానీ, మనపై మనకు ఉండే అతి ప్రేమ కానీ, స్వార్థం కానీ ఈ సమయంలో దూరమవుతాయి. శని ఒకటవ ఇంటిలో సంచరిస్తున్నప్పుడు శని దృష్టి 10వ ఇంటిపై, 3వ ఇంటిపై మరియు 7వ ఇంటిపై ఉంటుంది. ఈ సమయంలో మనం చేసే పనుల విషయంలో, మన ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనం బద్దకంగా ఉండడం కానీ, నిర్లక్ష్యంగా పనిచేయడం వలన కానీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనలు కూడా మనం నియంత్రించుకోవడం మంచిది. ఈ సమయంలో వృత్తిలో కానీ, మనం చేసే పనిలో కానీ బాధ్యతలు పెరగటం వలన మనలో ఉండే అజాగ్రత్త మరియు నిర్లక్ష్య ధోరణి దూరమవుతాయి. ఈ సమయంలో శని ఇచ్చే చెడు పలితాలు తగ్గడానికి మీరు బద్దకాన్ని వదిలేయటం, మరియు ఏ పనైనా పూర్తి బాధ్యతతో, ఏకాగ్రతతో, నిజాయితీగా పూర్తి చేయడం చేయాలి. మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగంలో మార్పులు జరగటం లేదా అనుకోని సమస్యలు రావడం జరుగుతుంది. మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ సమయంలో శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.

రెండవ ఇంటిలో శని సంచారం చేసేటప్పుడు మన కుటుంబ విషయాల్లో మరియు ఆర్థిక విషయాల్లో మనకు సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలు మన మన కుటుంబానికి మరింత దగ్గరయ్యేలా చేస్తాయి తప్ప వారికి మనను దూరం చేయవు. కుటుంబం పట్ల మనలో ఉండే అతి జాగ్రత్త కానీ, అతి ప్రేమ కానీ లేదా నిర్లక్ష్యం కానీ ఈ సమయంలో తగ్గడమే కాకుండా మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వర్తించేలా చేస్తుంది. మీరు బాధ్యతలను తప్పించుకునే వారైతే లేదా మీ కుటుంబం పట్ల ప్రేమ కంటే ఎక్కువ వారిపై అధికారం చెలాయించాలనే మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే మీపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించే వారైతే మీపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు. రెండవ ఇంట్లో శని సంచారం ఆర్థికంగా మీలో ఉండే లోపాలను తొలగించి మిమ్మల్ని ఆర్థికంగా పటిష్టంగా చేస్తుంది. ఈ సమయంలో మీరు అతిగా పొదుపు చేయటం కానీ, అవసరానికి తగిన విధంగా డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం కానీ చేస్తే అది మీకు ఖర్చులను మరో రూపంలో పెంచుతుంది. అలాకాకుండా మీ కుటుంబం కొరకు కానీ, అవసరాల కొరకు గాని తగినంత డబ్బు ఖర్చు చేస్తే అది మీకు మరింత డబ్బునిస్తుంది తప్ప నష్టాలనివ్వదు.

శని ఇచ్చే ఫలితం ఏదైనా ఆ సమయంలో మన కష్టంలో అనిపించిన భవిష్యత్తులో మన అభివృద్ధికి దోహదపడేది తప్ప మనకు చెడు చేసేది కాదు. శనిగోచారం సరిగా లేనప్పుడు మనం శారీరకంగా కష్టపడటం, ఇతరులకు సహాయం చేయటం మరియు అవసరమైన వారికి ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ సాయపడితే శని మనకు ఇచ్చే కష్టం తగ్గుతుంది.
మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం
మేష రాశి వారికి 12వ ఇంటిలో శని ఉన్నప్పుడు, శని దృష్టి 6వ, 9వ మరియు 2వ ఇంటిపై ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, కుటుంబానికి దూరంగా, దూర ప్రదేశంలో మీకు నచ్చక పోయినప్పటికీ పని చేయాల్సి రావటం, మీ మాటకు విలువ తగ్గటం, మరియు మీరు చెప్పేదొకటి, చేసేదొకటి అవటం వలన ఈ సమయంలో మీపై మీ తోటి వారికి నమ్మకం తగ్గటం మొదలైన ఫలితాలుంటాయి. ఈ సమయంలో శని ప్రభావం తగ్గాలంటే మీరు నిజాయితీగా పని చేయటం, ఎంత కష్టమైనప్పటికీ చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం, లోభాన్ని, బద్ధకాన్ని విడానడటం చేయాలి.

మేష రాశి వారికి శని ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు శని దృష్టి 3వ ఇంటిపై, 7వ ఇంటిపై మరియు 10వ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా ఉద్యోగంలో అవకాశాలు కోల్పోవటం, పేరు ప్రఖ్యాతుల కొరకు సుళువైన లేదా తప్పుడు మార్గాలు ఎంచుకోవటం దాని కారణంగా అపఖ్యాతి పాలవ్వటం, కోపం, ఆవేశం ఎక్కువ్వటం, గొప్పలకు పోయి, సామర్థ్యానికి మించిన పనులు చేసి ఇబ్బంది పాలవ్వటం, మరియు జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కాని వివాదాలు ఏర్పడటం మొదలైన ఫలితాలుంటాయి. ఈ సమయంలో శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గాలంటే, మన ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నిజాయితీగా ఉండటం, వినయంగా ఉండటం, అహంకారాన్ని, వేగంగా లేదా సుళువుగా పనులు పూర్తి చేయాలనే ఆలోచనను తగ్గించుకోవటం, ఫలితంపై దృష్టి పెట్టకుండా పనులు చేయటం మొదలైనవి అలవరచుకుంటే, శని ప్రభావం తగ్గటమే కాకుండా, మీ భవిష్యత్తు కూడా బాగు పడుతుంది.

మేష రాశి వారికి రెండవ ఇంటిలో శని సంచరిస్తున్నప్పుడు శని దృష్టి నాలగవ ఇంటిపై, 8 వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉంటుంది. ఈ మూడు ఇండ్లు కూడా కుటుంబము మరియు ఆర్థిక స్థితికి కారకత్వం వహిస్తాయి. ఈ సమయంలో ఆర్థిక సమస్యలు పెరగటం లేదా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖర్చులు తట్టుకోలేక ఇతరుల నుంచి డబ్బు అప్పు తీసుకోవడం కానీ లేదా ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకోవడం గాని చేస్తారు. ఈ సమయంలో ఆడంబరాలకు పోకుండా డబ్బు పొదుపు చేయడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చేస్తే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా వీలైనంతవరకు అవసరం ఉన్నవారికి స్తోమతకు తగ్గిన విధంగా కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా శని ప్రభావం తగ్గుతుంది. ఈ సమయంలో శని మనకు డబ్బు పై ఉన్న వ్యామోహాన్ని తొలగించడమే కాకుండా పొదుపును మరియు సరైన విధంగా డబ్బు ఖర్చు చేసే పద్ధతులను నేర్పిస్తాడు. ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ మనం తప్పు చేయకుండా ఉండేలా చూసుకోవటం మరియు మన ఆర్థిక స్తోమతకు తగిన విధంగా ఖర్చులు పెట్టడం చేయటం మంచిది. దాని కారణంగా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఈ సమయంలో శని దృష్టి నాలుగవ ఇంటిపై కూడా ఉంటుంది కాబట్టి స్థిరాస్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.

శని ప్రభావం తగ్గించుకోవడం ఎలా?
శని ప్రభావం తగ్గటానికి దైవ సంబంధమైన పూజలు, మంత్ర పఠనం, స్తోత్ర పఠనంతో పాటుగా మన జీవన విధానాన్ని, అలవాట్లను మార్చుకోవటం మరియు క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం చేస్తే శని ప్రభావం తగ్గడమే కాకుండా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: