శ్రీ లలిత దేవి చరిత్ర Part-12

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామిజీ విరచిత 💐

 🌹 శ్రీ లలిత దేవి చరిత్ర 🌹

Part-12

🌷లలితాసిద్ధుడు - భాస్కరరాయలు🌷

దక్షిణ దేశంలో భాస్కరరాయల వారు ఒక గ్రామంలో ఉండగా మధ్యాహ్నం భోజనానంతరం ప్రతిరోజూ ఇంటిముందున్న అరుగు మీద విశ్రమించే వారు.సాయంకాలం అవుతుండగా ఒక సన్యాసి ఆ వీధిలో నున్న మహాలింగస్వామి దేవాలయానికి వెడుతూ భాస్కరరాయలను చూచేవాడు. విశ్రాంతి తీసుకుంటున్న భాస్కరరాయలు ఆయన రాకను గమనించేవాడు కాదు. ఈ గృహస్థు ఎవరో తనను చూచి లెక్క చేయడం లేదు. యత్యాశ్రమ గౌరవం చూపించడం లేదు అని ఆ సన్యాసి భావించారు. ఒక రోజు అనుకోకుండా ఆ ఆలయానికి భాస్కరరాయల వారు వెళ్ళడం ఆ సమయానికి ఆ సన్యాసి అక్కడ ఉండడం జరిగింది. అక్కడి భక్తులందరి సమక్షంలో ఆ సన్యాసి ధర్మాధర్మములు తెలియని అజ్ఞానివి అని భాస్కరులవారిని తూలనాడాడు.

భాస్కరులవారు వినయంతో “స్వామీ! మీ రాకపోకలు నాకు తెలియవు. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను కనుక మిమ్ములను చూడలేదు. కనుక నేను నా ధర్మాన్ని అతిక్రమించలేదు. కాని మీరు ఇప్పుడు మీ ధర్మాన్ని అతిక్రమించారు. వాక్పారుష్యము, దూషణ సన్యాసులకు ఉచితము కాదు కదా ! అయినా ఇప్పుడు చెబుతున్నాను. మీకు నమస్కరించటానికి నాకు అభ్యంతరము లేదు. కాని నా ప్రణామాన్ని మీరు భరించలేరు” అన్నారు. “అంత భరించలేనిదేమిటో చూద్దామని అన్నాడు" ఆ సన్యాసి. “అయితే మీ దండాన్ని అక్కడ పెట్టండి. ముందు దానికి నమస్కరిస్తాను. ఏమి జరుగుతుందో చూడండి" అని అన్నారు భాస్కరరాయలు. ఆ యతి తన దండాన్ని అక్కడ పెట్టి తాను దూరంగా నిలుచున్నాడు. భాస్కరుల వారు ఆ దండమునకు నమస్కారము చేయగానే ఆ దండము పెళ్ళున ముక్కలు ముక్కలుగా అయ్యింది. ప్రేక్షకులు భయభ్రాంతులైనారు. ఆ సన్యాసి క్షమాపణ వేడి "ఆర్యా ! మీరు నాకు నమస్కరించవలసిన పనిలేదు. కాని లోకదృష్టిలో సన్యాసాశ్రమమునకు ఇవ్వవలసిన గౌరవము ఇవ్వాలి కదా ? మా గౌరవ భంగం కాకుండా ఉండే పద్ధతిని మీరు ఆలోచించండి" అని అన్నారు. ఆనాటి నుండి భాస్కరులవారు, సన్యాసి ఆ వీధిలోకి వచ్చే సమయానికి ఇంటిలోనికి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ఎన్నో మహామహిమలు ప్రదర్శించి శ్రీ లలితాదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది చరమ వయస్సు నందు తంజావూరు మహారాజు తనకు సమర్పించిన భాస్కరరాయపురము నందు (కావేరీనది ఉత్తరపు ఒడ్డున తిరువలకాడు ఎదురుగా) స్థిరపడినారు. జీవితంలో చివరి భాగం అక్కడే గడిపి మహాక్షేత్రమైన మధ్యార్జునమనే (తిరువిదైమరుడూరు) ప్రదేశము నందు భౌతిక కాయాన్ని క్రీ.శ. 1785లో విడిచి పెట్టారు. ఆ వూరిలోని మహా ధనపుర వీధిలో వీరున్న ఇల్లు ఇటీవల వరకు ఉన్నది.

సాధనములో దక్షిణ వామ మార్గములు రెండూ ఉన్నవి. వేద మార్గాను యాయులు పంచమకారములనుపయోగించే వామాచార పద్ధతిని అంగీకరించరు.దానివలన భ్రష్టులవుతారని వారి విశ్వాసము. భాస్కరరాయల వారు శ్రుతి ననుసరించే సమయాచార పరుడనని సోమపీథినని, మహాగ్ని చితినని తన గ్రంథములో చెప్పుకొన్నాడు. లలితా సహస్ర నామములకు ఆయన రచించిన సౌభాగ్య భాస్కర వ్యాఖ్యాలో వామాచారమునకు ఇచ్చిన నిర్వచనము చిత్రముగా ఉంది. 912 వ నామము సవ్యాపసవ్యమార్గస్థా - అను దానిని వివరిస్తూ వామా చారమంటే ఒక విధంగా ఏకేశ్వరాధన అని విశదీకరించాడు. ఉదాహరణకు త్రిపురా ఉపసాకులు – ఏ దేవతా మంత్రాన్ని ఉచ్చరించినా దానికి త్రిపురభైరవీ నామాన్ని కలపాలి అని చెప్పాడు. ఇదం విష్ణుర్విచక్రమే అన్న చోట విష్ణు శబ్దం తర్వాత భైరవస్తు అని చేర్చాలి. సూర్యునకర్ష్య మిచ్చేటప్పుడు సూర్యాయమార్తాండ భైరవాయ అని చేర్చాలి. తృప్యతాం మాతః అనేటప్పుడు భైరవీమాతః, అని పితః తృప్యతాం అనేప్పుడు పితః భైరవః తృప్యతాం అని చెప్పాలి. వామ మార్గములో అన్ని క్రియలు దేవీ పరములే.

బాలా త్రిపురసుందరి, భైరవి మొదలగు వారిని వామ మార్గమున ఆరాధించవచ్చును. కామేశ్వరిని ఉభయ పద్ధతులలో పూజించవచ్చు. మహామాయ, శారద, హైమవతి మొదలగు కొందరిని దక్షిణ మార్గములోనే పూజించవలెను. వీరిని వామమార్గములో పూజిస్తే పాపంవస్తుంది. సర్వలోక భ్రష్టుడవుతాడు. వామాచార పరుడు ఇహలోకంలో మహాభోగాలను అనుభవిస్తాడు. భూతప్రేత ములను, క్రూరమృగాలను వశం చేసుకోగలడు. కాని మోక్షం మాత్రం ఆలస్యమవుతుంది. ఈ విధంగా ఎన్నో రహస్యాలను విశేషాలను తమ వ్యాఖ్యలో భాస్కరుల వారు వివరించారు. వారి వంశానికి మహారాజులు సమర్పించిన 'భారతి' అన్న బిరుదు సార్థకమై వారి తరువాత ఇంటి పేరు 'భారతుల' అని ప్రసిద్ధిమైనదని కొందరి అభిప్రాయము. ఆంధ్రదేశంలో భారతుల యింటిపేరు గల వారిలో చాలామంది గొప్ప పండితులు మంత్రశాస్త్రవేత్తలు. భాస్కరరాయల మహామహిమలను సిస్తే నారాయణ శాస్త్రి అనే విద్వత్కవి 'భాస్కరచంపూ' గ్రంథంలో మహాద్భుతంగా వర్ణించాడు. భాస్కరరాయ శిష్యుడు జగన్నాథుడు భాస్కర విలాసమనే కావ్యాన్ని రచించి గురువుగారి జీవిత విశేషాలెన్నో లోకానికి తెలియ జేశాడు.

లలితాదేవి మంత్రసిద్ధులల్లో శ్రీదేవితత్వ వ్యాఖ్యాతలలో భాస్కరరాయలంతటి వారు మరొక్కరు లేరంటే అతిశయోక్తి కాదు. వారికి నాతో గల పూర్వ జన్మసంబంధం చేత ఎంతో ప్రేమతో ఇటీవల సిద్ధశరీరంతో కుర్తాళం లోని మా సిద్ధేశ్వరీ పీఠానికి విచ్చేసి అనుగ్రహించారు. ఆ మహనీయుని స్మరించటం లలితోపాసకులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

( సశేషం )

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

అష్ట భైరవ మంత్రం