మాట్లాడే మౌనం!
మాట్లాడే మౌనం! స రిగ్గా మాట్లాడటం ఎంత కష్టమో, మౌనంగా ఉండటమూ అంతే కష్టం. అది మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు. వాక్కును నియంత్రించడం మౌనం. అది ఒక యోగం, ఒక యాగం, సకలభాషలూ సమ్మిళితమైన విశ్వభాష. అన్నివైపుల నుంచీ సమున్నతమైన భావాలను, ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది రుగ్వేదం. అలా చేయాలంటే మౌనారాధనం అవశ్యం అనుసరణీయం. ‘మౌనంగా ఉన్నవాడే ఎల్లెడలా ప్రశాంతతను పంచగలడు’ అంటాడు చాణక్యుడు. మౌనంలో మహత్తరశక్తి దాగి ఉంది. ‘మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారం’ అంటారు. మితంగా మాట్లాడటమూ మౌనమే అని చెబుతోంది మహాభారతం. హితంగా, మితంగా మాట్లాడలేకపోతే మౌనమే మేలని విదురనీతి. మౌనం మాట్లాడినంత తీయగా మరే భాషా మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌనభాషకు ఉంటాయి. మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాడికే మౌనం విలువ తెలుస్తుంది. ఆదిశంకరులు, విద్యారణ్యస్వామి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మొదలైన మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనగ్రాహ్యాలయ్యాయి. మన సనాతన సంప్రదాయంలో జిజ్ఞాసువులంతా ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి, అవగాహన చేసుకుని హృదయాల్లో నిక్షిప్...