అంతర్ధశాఫలములు
అంతర్ధశాఫలములు: మహాదశానాధుడు మిక్కిలి బలవంతుడై శుభ షడ్వర్గులు కలిగి, షడ్బల సంపన్నుడై, అష్టక వర్గువలన బిందువుల కంటే ఎక్కువ బిందువులు కలిగి, నీచా సంగతాది దోషములు లేక, లగ్నము లగాయితు కేంద్రకోణముల యందు బలముగా ఉన్న ఎడల, అట్టి మహాదశారంభము నుండి చివర వరకు మిక్కిలి హెచ్చుగా యోగించును. అనగా ఆ మహాదశలో నడుచునట్టి అంతర్ధశా భుక్తులన్నియు ఆ మహాదశానాధుని అనుసరించియే దానికి తగిన ఫలితములనిచ్చుచుండును. అట్టి బలవంతుడైన మహాదశలో ఆ దశానాథుని లగాయతు షష్టాష్టమవ్యయ స్థానములయందున్న గ్రహముల అంతర్దశల యందు సామాన్యముగా చెడు ఫలితములు కలుగవు. మహాదశానాధుడు మిక్కిలి దుర్బలుడై ఉన్నప్పుడు వానితో శుభునియొక్క అంతర్ధశ వచ్చినను శుభ ఫలములనీయక ఆ మహాదశ అంతయు పూర్తిగా చెడిపోవును.